Sri suktha Rahasyardha pradeepika    Chapters   

శ్రీమాత కిది యంకితము

కమల! నాచూపు పున్నమచూ పమావాస్య

చూపు పాడ్యమినాఁటి చూడ్కి యనవు;

ఏణాంకశతశంక నెసఁగు చిర్నగుమోము

నిగ్గువెల్లువల మున్గింతు వీవు;

ఈదృశంబని పల్క నెనలేని బలుతళ్కు

తోఁదోఁచి నాయున్కి తోఁపనీవు;

లలితలాస్యమున నిశ్చలత సంవిద్దేవ

తలకెల్లఁగూర్చి నన్దన్పు దీవు;

హ్రీంపీఠసంస్థరాజేశ్వరీ! నీయాన

శీర్షధార్యముగ శిక్షించితీవు;

హరరూప శంకరగురుని 'సౌందర్యల

హరి''కిఁ దెన్గన్న సాహసముఁగొంటి;

సరస ''బాలాంబికా'' సంజ్ఞతో నాస్తుతి

శతకమన్నను యథాశక్తినంటి;

కలవుగా ''మనముచ్చటలు'' కొన్ని వందలు

పలుకుమన్నను మూడు వందలంటి;

హర్షింపఁగా సూర్యుఁడా ''సౌరమంత్రముల్‌''

తెన్గింపుమన్నంతం దెగువ గొంటి;

లలితమౌ తెన్గు పద్దెలు కాళిదాసుని

''పంచస్తవికి'' నన్న పసుపు గొంటి;

''హ్రీంకారభావము'' లేరిచి నూఱు, నీ

కర్పింతునన ''నాగు''మన్న వింటి;

సకలసాధకహర్షసంధాయి ''శ్రీసూక్త

గుప్తార్థ'' మెదొ తెల్పఁగోరుకొంటి,

కలము పట్టుము, కల్యాణకాంక్షి! యనఁగ

లబ్ధసుఖినౌచు వ్రాసి యీ లలితకృతిని,

హ్రీంశరీరిణి! శ్రీంశరీరికిణికి నీకె

ఈంమతీ! యందచు నిచ్చితి నేలుకొమ్ము||

-

Sri suktha Rahasyardha pradeepika    Chapters